సోమవారం, 8 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 సెప్టెంబరు 2025 (17:25 IST)

ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి వద్దు... : ప్రధాని నరేంద్ర మోడీ

modi - wong
ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరిని అవలంభించవద్దని ప్రపంచ దేశాలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. తాము కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదంపై పోరాటం చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు. ఉగ్రవాదంపై సింగపుర్‌‌తో కలిసి భారత్‌ పోరాడుతోందన్నారు. గురువారం ఆ దేశ ప్రధాని లారెన్స్‌ వాంగ్‌ న్యూఢిల్లీలో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్‌-సింగపుర్‌ మధ్య పలు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. డిజిటల్‌ అసెట్‌ ఇన్నోవేషన్‌పై భారత ఆర్‌బీఐ, మానిటరీ అథారిటీ ఆఫ్‌ సింగపుర్‌ మధ్య అగ్రిమెంట్‌ జరిగింది. 
 
ఈ సమావేశం సందర్భంగా ఇరు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు అవసరమైన రోడ్‌మ్యాప్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఉన్న భౌగోళిక రాజకీయ ఒడిదొడుకులను తట్టుకోవడానికి ఇరు దేశాల సంబంధాలు మరింత బలోపేతం కావాల్సిన విషయాన్ని లారెన్స్‌ వాంగ్‌ నొక్కి చెప్పారు. 
 
ఇక ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఉగ్రవాదంపై ఇరు దేశాలకు సమష్టిగా టెర్రరిజంపై పోరాడటం మానవత్వాన్ని నమ్మే ప్రతిదేశం విధి అని రెండు దేశాలు బలంగా విశ్వసిస్తున్నాయని చెప్పారు. సమష్టిగా విశ్వసించే విలువలే పునాదిగా ఇరుదేశాల సంబంధాలు ఉన్నట్లు మోడీ  పేర్కొన్నారు. ఇదే పరస్పర ప్రయోజనాలను, శాంతి, సుసంపన్నతకు అవసరమైన సమష్టి దార్శనికత అందిస్తుందన్నారు.