బుధవారం, 6 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 ఆగస్టు 2025 (19:16 IST)

ఉత్తరకాశీలో క్లౌడ్ బరస్ట్ : కొట్టుకునిపోయిన గ్రామం

northkashi
దేవభూమిగా ప్రసిద్ధికెక్కిన ఉత్తరాఖండ్‌ రాష్ట్రాన్ని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా, ఉత్తరకాశీలో కుంభవృష్టి కురుస్తోంది. క్లౌడ్ బరస్ట్ కారణంగా పెను విషాదం చోటుచేసుకుంది. హర్సిల్ సమీపంలోని ధారాలీ ప్రాంతంలో ఆకస్మిక వరదలు పోటెత్తడంతో ఓ గ్రామం పూర్తిగా వరద నీటిలో కొట్టుకునిపోయింది. ఈ దుర్ఘటనలో పలువురు స్థానికులు గల్లంతైనట్లు సమాచారం అందడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
 
ధారాలీ వద్ద ఉన్న ఖీర్‌గఢ్ వాగులో నీటిమట్టం ఒక్కసారిగా ప్రమాదకర స్థాయిలో పెరగడంతో వరద నీరు సమీపంలోని మార్కెట్ ప్రాంతాన్ని ముంచెత్తింది. దీనివల్ల తీవ్ర ఆస్తి నష్టం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీస్, అగ్నిమాపక శాఖ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), భారత సైన్యం రంగంలోకి దిగాయి. విపత్తు సహాయక బృందాలు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభించాయి.
 
ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'ధారాలీ ప్రాంతంలో కుండపోత వర్షం వల్ల జరిగిన నష్టం గురించి తెలిసి చాలా బాధపడ్డాను. ఎన్డీఆర్ఎఫ్, ఎన్టీఆర్ఎఫ్, జిల్లా యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి' అని ఆయన 'ఎక్స్' వేదికగా తెలిపారు. సీనియర్ అధికారులతో తాను నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నానని చెప్పారు. 'అందరూ క్షేమంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను' అని ఆయన పేర్కొన్నారు.
 
కాగా, ఆగస్టు 4 నుంచి ఉత్తరకాశీ, పౌరీ గద్వాల్, టెహ్రీ, చమోలీ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఒకరోజు ముందే హెచ్చరికలు జారీ చేసింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో డెహ్రాడూన్ జిల్లా యంత్రాంగం పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించింది. ముఖ్యమంత్రి ధామి కూడా అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ సమావేశం నిర్వహించి సంసిద్ధతను సమీక్షించారు. అయినప్పటికీ ఈ స్థాయిలో నష్టం జరగడం విచారకరం.