శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 అక్టోబరు 2024 (09:30 IST)

అడిగినన్ని దర్శన టిక్కెట్లు ఇవ్వలేదన్న కోపంతో ఆరోపణలు : టీటీడీ

venkateswara swamy
శ్రీకాకుళం జిల్లా కృష్ణాపురం గ్రామంలోని ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులపై చేసిన ఆరోపణలపై తితిదే అధికారులు స్పందించారు. స్వామీజీ అడిగినన్ని దర్శన టిక్కెట్లు ఇవ్వలేదన్న కోపంతోనే తమపై ఆరోపణలు చేశారని తితిదే జేఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. 
 
కాగా, తితిదే జేఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తమకు శ్రీవారి దర్శన టికెట్లు ఇవ్వకుండా అవమానించారంటూ శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ ఆరోపణలు చేశారు. స్వామిజీ ఆరోపణలపై టీటీడీ వివరణ ఇచ్చింది. వాస్తవానికి సదరు స్వామీజీ 50 మందికి బ్రేక్ దర్శనం, 550 మందికి ప్రత్యేక దర్శనంతో పాటు తిరుమలలో వసతి కల్పించాలని టీటీడీ అధికారులను కోరారని చెప్పారు. అయితే వారు అడిగిన మేరకు వసతి కల్పించేందుకు అంగీకరించడం జరిగిందన్నారు.
 
అయితే సాధారణంగా తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక ఆ రోజున దర్శనం కొరకు ఇంతమందికి ఇవ్వడం సాధ్యం కాదని, 600 మంది సంఖ్యను తగ్గించాలని అదనపు ఈవో కోరారని, అయితే సదరు స్వామీజీ తాము అడిగిన 600 మందికి దర్శనం కల్పించాలని పట్టుబట్టడం జరిగిందని తితిదే తెలిపింది. తాము అడిగినంతమందికి శ్రీవారి దర్శనం టికెట్లు ఇవ్వలేదన్న కోపంతో మీడియా సమక్షంలో తితిదే అధికారిని తీవ్ర స్థాయిలో కించపరుస్తూ స్వామీజీ మాట్లాడారని, ఇది స్వామీజీ స్థాయికి తగదని టీటీడీ పేర్కొంది.