రూ.20 కోట్ల ఆస్తి కోసం భర్తను కిడ్నాప్ చేసింది.. కానీ పోలీసులకు చిక్కింది.. ఎలా?
తన భర్తను కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేశారనే ఆరోపణలతో నగర పోలీసులు మంగళవారం ఒక మహిళను, ఆమె తొమ్మిది మంది సహచరులను అరెస్టు చేశారు. ఆ మహిళను ఎం మాధవీలతగా గుర్తించారు. ఆమె భర్త శ్యామ్‌తో మూడేళ్ల క్రితం విడిపోయారు. ఆ వ్యక్తి ఇటీవల తన పూర్వీకుల ఆస్తిని రూ. 20 కోట్లకు విక్రయించాడు. దీంతో ఆస్తులను లాక్కోవడానికి మాధవీలత ప్లాన్ చేసింది.
ఇందుకోసం తొమ్మిది మందితో కలిసి కిడ్నాప్ చేసేందుకు స్కెచ్ వేసింది. ఆ తొమ్మిది మంది శ్యామ్‌ను కిడ్నాప్ చేసి వేర్వేరు వాహనాల్లో విజయవాడకు తీసుకెళ్లారు. బంజారా హిల్స్‌లోని ఒక బ్యాంకు నుండి డబ్బు తీసుకోవడానికి కిడ్నాపర్లు అతన్ని హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.
అయితే బాధితుడు ఏదో ఒకవిధంగా వారి నుంచి తప్పించుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని గుర్తించి అతని భార్యతో సహా వారిని అరెస్టు చేశారని డిసిపి ఈస్ట్ జోన్ బాలస్వామి తెలిపారు.
లత తన భర్త ఆస్తులను లాక్కోవాలని, పత్రాలపై సంతకం చేయమని బలవంతం చేసి అతనిని అంతమొందించాలని కూడా ప్లాన్ చేసిందని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇంకా దర్యాప్తును ముమ్మరం చేసినట్లు పోలీసులు చెప్పారు.